అమెరికాలోని అట్లాంటా ప్రవాసులు ఈదర మోహన్ మరియు ఈదర కల్పన ఇండియాలో దాతృత్వాన్ని చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూర్ జిల్లా, గుడిపాల మండలంలోని నరహరిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినీవిద్యార్థులకు ఉచిత బస్ పాసులు అందజేశారు.
సర్దార్ మిట్ట గ్రామానికి చెందిన ఈదర మోహన్, కల్పన ఎన్నో ఏళ్లుగా తాము పుట్టిపెరిగిన ప్రాంతంలో పలు సేవాకార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. అందులో భాగంగా స్థానిక మండల్ పరిషత్ ప్రెసిడెంట్ ప్రసాద్ రెడ్డి చేతులమీదుగా సుమారు 50 మంది విద్యార్థినీవిద్యార్థులకు ఉచిత బస్ పాసులు అందజేశారు.
ఈ సందర్భంగా చిత్తూరు డిపో మేనేజర్ రూపశ్రీ మాట్లాడుతూ ఈ రోజుతో గుడిపాల మండలంలోని 6 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో మొత్తం 800 మంది పేద విద్యార్థులకు ఉచిత బస్ పాసులు, గుర్తింపు కార్డులు అందజేసినందుకు మోహన్ మరియు కల్పన లను అభినందించారు.
పేద విద్యార్థుల విద్యాభివృద్ధి కోసమే ఈ సేవాకార్యక్రమాలను చేస్తున్నట్లు ఈదర మోహన్ తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో వసంతాపురం సర్పంచ్ రజనీకాంత్, చిత్తూరు డిపో అసిస్టెంట్ మేనేజర్ అల్తాఫ్, సిబ్బంది ఎన్ టి నాయుడు, రామ్మూర్తి, డివిఆర్ రాజు, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.