Published
3 hours agoon
By
Sri NexusDallas లో డిసెంబరు నెల 15 వ తేదీ ఆదివారం జరిగిన డల్లాస్ ఫోర్ట్ వర్త్, ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం, టాంటెక్స్ (TANTEX) ”నెల నెలా తెలుగు వెన్నెల”, తెలుగు సాహిత్య (Literary) వేదిక 209 వ సాహిత్య సదస్సు ”జగము నేలిన తెలుగు ” అంశంపై ” కొప్పెల్, టెక్సాస్ (Coppell, Texas) నగరము శ్రీ లెనిన్ వేముల (Lenin Vemula) గారి స్వగృహము నందలి సమావేశ మందిరము వేదికగా విజయవంతముగా నిర్వహించబడింది.
సదస్సు ప్రారంభ సూచికగా మోహన రాగంలో త్యాగరాయ కృతి ”రామా నన్ను బ్రోవరా ” కీర్తననుచిరంజీవి సమన్విత మాడా తన మధుర కంఠంతో వీనుల విందుగా పాడి సాహితీ ప్రియులను భక్తిపారవశ్యంలో ముంచెత్తింది. తొలుత ఈమధ్యనే దివంగతులైన టాంటెక్స్ (TANTEX) పూర్వపు అధ్యక్షులు శ్రీ లావు రామకృష్ణ గారికి సభ్యులందరూ ఒక నిముషము మౌనము పాటించి ఘనంగా నివాళు లర్పించడం జరిగింది.
ప్రముఖ సాహితీ విమర్శకులు శ్రీ లెనిన్ వేముల (Lenin Vemula) “పలనాటి విరసం చిరునామా- కామ్రేడ్ రామినేని” – అన్న శీర్షికపై ప్రసంగిస్తూ పలనాడు జిల్లా మాచర్ల కేంద్రంగా జన చైతన్య సాహిత్య విస్తృతికి విశేషంగా పాటుపడి, పౌరహక్కుల ఉద్యమాలకు 70వ దశకం నుండి 30 యేళ్ళ సుదీర్ఘ కాలంగా వెన్నంటి నిలిచి, చివరి వరకూ నమ్మిన విలవలకు కట్టుబడి జీవించారు.
నాయకత్వ కుశలతతో ఎందరినో ఉత్తమ ఆశయాల వైపు ఆకర్షింపజేసి గతవారం కన్నుమూసిన కామ్రేడ్ రామినేని సాంబశివరావుకు అలనాటి విప్లవగేయాలనెన్నో విప్లవాత్మక రాగంతో ఆలపించి ఆరుణారుణ వందనాలతో అంజలి ఘటించారు శ్రీ లెనిన్ వేముల (Lenin Vemula). తన పార్థివ శరీరాన్ని సైతం మెడికల్ కాలేజీకి డొనేట్ చేసి చివరి వరకూ శాస్త్రీయ దృక్పథానికే తన విశ్వాసాన్ని చాటిన రామినేనికి సాహిత్య సభ ఘననివాళులర్పించింది .
స్వాగతోపన్యాసం చేసిన శ్రీ దయాకర్ మాడా (Dayakar Mada) నేటి ముఖ్య అతిథి శ్రీమతి డి పి అనురాధ (D P Anuradha) గారి జీవిత విశేషాలను ,అఖండ తెలుగుజాతి పూర్వాపరాలను తెలుసుకోవడానికి వారు చేస్తున్నఎనలేని కృషిని చక్కగా వివరించారు. నేటి ముఖ్య అతిథి, సీనియర్ పాత్రికేయులు శ్రీమతి డి పి అనురాధ ఉపన్యాసం చేశారు.
శ్రీమతి డి పి అనురాధ మాట్లాడుతూ తెలుగు జాతి చరిత్రను పాఠ్య పుస్తకాలలో చదివిన తాను, తన గురువు శ్రీ తల్లాప్రగడ సత్యనారాయణ (Tallapragada Satyanarayana) గారి మార్గదర్శకత్వంలోనూ తన అత్తమామల ప్రోత్సాహంతోనూ దాదాపు రెండువేల సంవత్సరాలనుండీ నేటివరకూ ప్రపంచ వ్యాప్తంగా తెలుగు మాట్లాడుతున్న తెలుగు జాతి వారి మూలాలను అన్వేషిస్తూ పరిశోధక దృష్టితో అనేక దేశాలు పర్యటించినట్లు తెలియచేశారు .
తూర్పు దేశాల్లో స్థిరపడిన తెలుగుజాతివారి ని కలుసుకొని వారి పుట్టుపూర్వోత్తరాలు వారి భాషాభిమానం అనుభవ పూర్వకంగా తెలుసుకున్న శ్రీమతి అనూరాధ ఆదిమ తెలుగు జాతి ప్రాచీన ప్రాభవం నేటికీ ఎలా గుబాళిస్తోందో తనదైన శైలిలో చక్కగా వివరించారు. శ్రీలంక, మయన్మార్, వియత్నాం, థాయ్‌లాండ్, కంబోడియా,ఇండోనేషియాల్లో ముఖ్యమైన పట్టణాలు, మారుమూల పల్లెలు పర్యటించారు.
వివిధ ప్రదేశాలు తిరిగిన తాను ఆయాప్రదేశాల్లో తెలుగు వారి అడుగుజాడల పరిశీలన సాగించిన వైనాన్ని చక్కగా విశదీకరించారు. ఆయాదేశాల చారిత్రక స్థలాల లోనున్న స్థూపాలు, శాసనాలు (Edicts) పరిశీలించి, వాంగ్మయంలోను, వలస వెళ్ళిన వారి భాషలోను, వారి జ్ఞాపక కథనాలలోను, విడి విడిగా ఉన్న సమాచారాన్ని తనదైన పద్ధతిలో క్రోడీకరించి అన్వయించి చెప్తూ, వారి పూర్వీకులు మన ఆంధ్ర ప్రాంతం నుండి బతుకుతెరువు కోసం తప్పనిసరయి ఇతర దేశాలకు వెళ్లడం జరిగిందన్నారు.
ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో వారి పూర్వీకులు కట్టిన గుడి గోపురాలు కట్టిన విధానం, వారి వ్యవసాయ పద్ధతులు,వ్యాపార ధృక్పథం తాను పరిశీలించడం జరిగిందన్నారు. వారి ఆచార వ్యవహారాల్లోనూ జీవన వైవిధ్యం, కళాకారుల ఉత్తమ కృషి, వారి పనితనం మనం స్పష్టంగా చూడ వచ్చు నన్నారు.‘మన్’జాతిలో మనవాళ్ళను, థాయ్‌లాండ్ ‘చిమ్మయి’ పిల్లను, ద్వారావతి, హరిపుంజాయి వంటి థాయ్ ప్రాంతాల్లో మన పూర్వీకుల విశేషాలను , తెలుగు చీర చుట్టిన ‘చామదేవి’ చంపాలో ‘భద్రేశ్వరుని’ అక్కడ బంగారు తాపడాలు చేసిన ఘననిర్మాణాలు, శిల్పాలు చెక్కిన తెలుగు సంతతి వారి పూ ర్వీకుల తపనల స్వరూప విశేషాలను డి పి అనురాధ (D P Anuradha) గారు చక్కగా వివరించారు.
శ్రీలంక (Sri Lanka) కు మన శ్రీకాకుళానికి గల సత్సంబంధాన్ని చక్కగా వివరిస్తూ కొన్ని చోట్ల తాను ”మీరెవరు” అని పలకరించిన వెంటనే ప్రతివారుతమ సమాధానంగా ”అక్కా ”అంటూ ప్రతిస్పందించడం తననెంతో ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు.తెలుగు మూలాలు గలవారి వేషభాషలు, ఆచారవ్యవహారాలు, సంప్రదాయాలు, సంస్కృతిని చూసి,వారితో మాట్టాడి, ఆపై చారిత్రక ఆధారాలతో పోల్చి సరిచూచుకొన్నట్లు చెప్పు కొచ్చారు.
ఆయాప్రాంతాల్లో ఏళ్ల తరబడి నివసిస్తున్న తెలుగు వారు తమ భాషా సంస్కృతిని కాపాడుకొంటూ రాబోయే కాలంలో ఏదో ఒకరోజు ఆంధ్ర (Andhra) ప్రాంతమునుండి ”తలైవా” అంటే ”తెలుగు మాట్లాడే గౌరవప్రదమైన నాయకుడు” తప్పకుండా వస్తారనీ వారు తమఉనికిని గుర్తిస్తారనే ఆశతో బ్రతుకుతున్నతెలుగు జాతి వారి జీవన సరళిని కళ్ళకు కట్టినట్లు విశదీకరించారు.
తమిళ (Tamil) జాతి వారితో కలిసిమన తెలుగు వారు నివసిస్తున్న చోట్ల సింహ పురి, దంతపురి పేర్లతో పిలువ బడే నగరాలుండేవని పేర్కొన్నారు. అలాగే , ”విమల”, ”విజయ” అనే పేరు తో పిలువబడేవారు చాలా చోట్ల కనిపించారని కొన్ని చోట్ల మన తెలుగువారు తమ వారిని ఇంటిలో తెలుగు పేరుతోనూ బయట పని చేసేచోట తమిళ పేరుతోనూ పిలుచుకునే విధానాన్ని పాటిస్తున్నవైనం తన దృష్టికి వచ్చినట్లు ఆమె పేర్కొన్నారు.
ఆగ్నేయాసియాలో తెలుగువెలుగుని దేదీప్యమానం చేసే అఖండ తెలుగుజాతి విశేషాలను తాను శోధించిన పలు అంశాలను అనూరాధ గారు సోదాహరణంగా వివరించి, సాహితీప్రియుల నుండి విశేష అభినందనల నందుకొన్నారు. సంస్థ పూర్వాధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర (Prasad Thotakura), డాక్టర్ నరసింహ రెడ్డి ఊరిమిండి, శ్రీ చిన్న సత్యం వీర్నాపు , శ్రీ అనంత్ మల్లవరపు, ఇంకా శ్రీ చంద్రహాస్ మద్దుకూరిశ్రీ లెనిన్ వేముల, ఉపాధ్యక్షులు శ్రీ చంద్రశేఖర్ రెడ్డి పొట్టిపాటి, శ్రీ లెనిన్ బండ,శ్రీ మూలింటి రాజ శేఖర్, శ్రీమతి మాధవి సుంకిరెడ్డి, శ్రీమతి భాను,శ్రీ కొల్లారపు ప్రకాశరావు శర్మ, శ్రీ గోవర్ధనరావు నిడిగంటి వంటి సాహితీ ప్రియులు శ్రీమతి డి పి అనురాధ (D P Anuradha) గారి ప్రసంగంపై తమ తమ ప్రతిస్పందనలు తెలియచేశారు.
సాహితీ ప్రియులనందరినీ భాగస్వాములను చేస్తూ గత 80 మాసాలుగా నిరాటంకంగా నిర్వహిస్తున్న ధారావాహిక ”మన తెలుగు సిరి సంపదలు” చాలా బాగా జరిగింది. చమత్కార గర్భిత పొడుపు పద్యాలు ప్రహేళికలు. పొడుపు కథలు సహా దాదాపు యాభై ప్రక్రియల లో ని వైవిధ్య భరితమైన తెలుగు భాషా పదసంపద ను స్పృశించడం, అక్షర పద భ్రమకాలు ప్రశ్నలుగా సంధించి సాహితీ ప్రియులనుండి సరైన సమాధానాలను రాబట్టడంలో విజయవంతమైన డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి (Narasimha Reddy Urimindi) వారిని పలువురు ప్రశంసించడం జరిగింది.
తరువాత సంస్థ సమన్వయ కర్త శ్రీ దయాకర్ మాడా 2024 సంవత్సరంలో ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (Telugu Association of North Texas – TANTEX) టాంటెక్స్ మున్నెన్నడూ లేనివిధంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలుగు సాహిత్య సదస్సుల విశేషాలనూ ప్రధాన వక్తలైన ముఖ్య అతిథుల ప్రజ్ఞా పాటవాలను ”సింహావలోకనం”లో చక్కగా వివరించారు .
తరువాత ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్ (TANTEX) ప్రస్తుత అధ్యక్షులు శ్రీ సతీష్ బండారు (Satish Bandaru) మరియు సంస్థ సమన్వయ కర్త శ్రీ దయాకర్ మాడ (Dayakar Mada), నేటి ముఖ్య అతిథి శ్రీమతి డి పి అనురాధ గారికి టాంటెక్స్ సంస్థ తరపున సన్మాన పత్ర జ్ఞాపికను చదివి వినిపించి వారిని ఘనంగా సన్మానించడం జరిగింది. ఇంతమంది సాహితీప్రియుల మధ్య తనకు జరిగిన ఈసన్మానం అద్భుతమైన అనుభూతిని మిగిల్చిందని పేర్కొంటూ శ్రీమతి డి పి అనురాధ తన కృతజ్ఞతను వెలిబుచ్చారు.
ఉత్తర టెక్సాస్ తెలుగుసంఘం టాంటెక్స్ (TANTEX) ప్రస్తుత అధ్యక్షులు శ్రీ సతీష్ బండారు ,సంస్థ పూర్వాధ్యక్షులు,డాక్టర్ ప్రసాద్ తోటకూర,డాక్టర్ నరసిం హా రెడ్డి ఊరిమిండి, శ్రీ చంద్రహాస్ మద్దుకూరి, శ్రీ లెనిన్ వేముల, నవీన్ గొడవర్తి, శ్రీ దయాకర్ మాడా, శ్రీ లెనిన్ బండ, శ్రీమతి భాను,శ్రీమతి యద్దనపూడి లక్ష్మి, శ్రీమతి కిరణ్మయి గుంట, శ్రీ సురేష్ కాజా, శ్రీ వెంకట్ జె కె, శ్రీ శ్రీనివాస్ ,శ్రీ కొల్లారపు ప్రకాశరావు శర్మ ,శ్రీ గోవర్ధన రావు నిడిగంటి తోపాటు అంతర్జాలంలో అనేక మంది సాహితీ ప్రియులు పాల్గొనడంతో సదస్సువిజయవంతమైంది.
శ్రీ దయాకర్ మాడ (Dayakar Mada) వందన సమర్పణ గావించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు శ్రీ సతీష్ బండారు (Satish Bandaru), తమ అధ్యక్షోపన్యాసంలో, సంస్థ పూర్వాధ్యక్షులకూ, సంస్థ ఔన్నత్యానికి ఆర్ధికంగా తోడ్పడుతున్న దాతలకూ, ఇంకా ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియ చేశారు. నేటి కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (Telugu Association of North Texas) ప్రస్తుత అధ్యక్షులు శ్రీ సతీష్ బండారు, సమన్వయ కర్త శ్రీ దయాకర్ మాడా, సంస్థ పాలక మండలి మరియు అధికార కార్యవర్గ బృందం సభ్యులు అభినందనీయులు.