Connect with us

Literary

ప్రముఖ సాహితీవేత్తల వ్యక్తిగత కోణం: తానా సాహితీ సదస్సు దిగ్విజయం

Published

on

డిసెంబర్ 26న తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ‘తానా’ ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో అంతర్జాలంలో నిర్వహించిన ‘ప్రఖ్యాత సాహితీవేత్తలతో – ప్రత్యక్ష పరిచయాలు – ప్రత్యేక అనుభవాలు’ అనే సాహిత్య కార్యక్రమం ఎంతో ఆసక్తిదాయకంగా సాగింది. సాహిత్య లోకంలో లబ్దప్రతిష్టులైన సాహితీవేత్తలు – జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, పద్మభూషణ్ కవిసమ్రాట్ డా. విశ్వనాథ సత్యనారాయణ; నాటక, సినిమా పాటల, మాటల రచయిత, నిర్మాత, దర్శకుడు డా. ఆచార్య ఆత్రేయ; కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, జాతీయ ఉత్తమ గీత రచయిత, మహాకవి శ్రీశ్రీ; సుప్రసిద్ధ సినీ గీత రచయిత, పద్మశ్రీ చేంబోలు ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి గార్లు సృష్టించిన సాహిత్యం కాకుండా వారి వారి జీవితాలలోని అనేక మలుపులను, స్పూర్తిదాయకమైన వారి జీవనయానాన్ని వారితో ప్రత్యక్ష పరిచయాలున్న వివిధ ప్రముఖలు ఈ కార్యక్రమంలో ఆవిష్కరించడం ఒక ప్రత్యేకత.

తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు స్వాగాతోపన్యాసంలో విశిష్ట అతిధులందరినీ ఆహ్వానించి సాహితీచరిత్రలో ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూరను, వేదిక సమన్వయ కర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ ను ప్రత్యేకంగా అభినందించారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “ప్రముఖ సాహితీవేత్తల పేర్లు, వారు సృష్టించిన సాహిత్యం మాత్రమే మనకు తెలుస్తుంది గాని వారి వారి జీవితాలలో ఎదురైన అవరోధాలు, ఎదుర్కొన్న సవాళ్లు, వారి కుటుంబ బాధ్యతలు, వృత్తిపరమైన ఒత్తిళ్ళు, ఆర్ధిక ఇబ్బందులు లాంటివాటిని ఎన్నింటినో నిబద్ధతతో తట్టుకుని, సాహిత్య లోకంలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న తీరు, వారు సృష్టించిన సాహిత్యం మానవాళికి ఎంతో స్పూర్తిదాయకం అన్నారు”.

అచ్చతెలుగు అవధాని డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ యువకుడుగా ఉన్నప్పుడు కవిసమ్రాట్ డా. విశ్వనాథ సత్యనారాయణ గారిని తరచూ కలుస్తూ, చాలా దగ్గరగా ఆయనతో గడిపిన రోజులను, సాగించిన సంభాషణలను, చూసిన సన్నివేశాలను విశదీకరించారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత శ్రీ చొక్కాపు వెంకటరమణ తాను ఒక పత్రికకు సహాయ సంపాదకుడుగా పనిచేస్తున్న సమయంలో, ఒక ఇరవై రోజుల పాటు విశ్వనాథ వారిని రోజూ కలసి, విశ్వనాథవారి “కుక్కగొడుగులు” అనే చివరి నవల ఆయన చెప్తున్నప్పుడు శ్రీ చొక్కాపు రాసుకునే సందర్భాలలో జరిగిన అనేక హాస్య సంఘటనలను చాలా హృద్యంగా వివరించారు. ప్రముఖ సినీ కథా రచయిత, పాటల రచయిత, దర్శకుడు శ్రీ జే.కె. భారవి మనసు కవి ఆచార్య ఆత్రేయ వద్ద పదకొండు సంవత్సరాల పాటు ఉండి అనునిత్యం ఆయనతో గడిపినప్పుడు జరిగిన అనేక సంఘటనలతో పాటు, ఆత్రేయ జీవితంలో ఎదురైన ఎన్నో ఆటుపోట్లను, ఆర్ధిక సవాళ్ళను ఎదుర్కొని నిలిచిన తీరును చాలా ఆసక్తిదాయకంగా వివరించారు. ప్రముఖ కథా రచయిత, సాహితీవేత్త డా. వంగూరి చిట్టెన్ రాజు మహాకవి శ్రీశ్రీ తన భార్య సరోజతో పాటు హూస్టన్ లో తమ ఇంట్లో కొన్ని వారాల పాటు బసచేసినప్పుడు రచించిన సిప్రాలి అనే కవితా సంపుటి విశేషాలను, ఆయనతో జరిపిన సమాజశ్రేయస్సు కాంక్షించే అనేక సంభాషణలను నేమరవేసుకున్నారు.

పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి ని బాల్య దశ నుంచి ఎరిగిన, ఆయన దుందుడుకు స్వభావాన్ని, స్థిర నిస్చయంలేని అనేక నిర్ణయాలను, భావోద్వేగాలను ఒక క్రమ పద్దతిలో పెట్టి ఆయనలోని సృజన శక్తిని గమనించి అద్భుతంగా పాటలు రాయగలవు అని ప్రోత్సహించి, సినిపరిశ్రమకు పరిచయం చేసి ఆయన తుదిశ్వాస వరకు సిరివెన్నెల కుటుంబంలో ఒక సభ్యుడిగా మెలిగిన ప్రముఖ సామాజిక సేవకుడు, విశ్రాంత అధ్యాపకుడు సిరివెన్నెలకు స్పూర్తిప్రదాత అయిన శ్రీ యర్రంశెట్టి సత్యారావు మాస్టారు సిరివెన్నెల జీవితాన్ని ముఖ్యంగా సినిమా రంగ ప్రవేశం ముందు జీవితాన్ని అత్యద్భుతంగా ఆవిష్కరించారు. శ్రీ కౌముది అంతర్జాతీయ మాసపత్రిక సంపాదకులు, ప్రముఖ కవి, వక్త, రేడియో కార్యక్రమాల వ్యాఖ్యాత శ్రీ కిరణ్ ప్రభ సిరివెన్నెల తో తనకున్న ఇరవై సంవత్సరాల పైగా ఆత్మీయ అనుబంధాన్ని, వందల గంటల సంభాషణలను, ఆయన ఆలోచనా సరళిని, రచనాశైలిని సిరివెన్నెల కాలిఫోర్నియాలో తమ ఇంటిలో దాదాపు రెండు నెలల పాటు బస చేసినప్పుడు పాడిన పాటలను, మానవ సంబంధాల పై ఆయన చూపిన ప్రత్యేక అభిమానాన్ని కిరణ్ ప్రభ చక్కగా వివరించి చెప్పారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected